Thursday, January 6, 2011

సమస్యల హారతి - "భారతి"

నాడు...
సిరులెన్నో చిగురించిన 
రత్నగర్భ  "భారతి".
నేడు...
సమస్యల ప్రళయంలో
భగ్గుమన్న హారతి.
వనరులేన్ని వడివడిగా
కరిగిపోతున్నా
పల్లెనున్న పేదవాడి
ఆకలిరోదన ఆగేనా...? 
అవినీతి  అంటువ్యాధిలా 
అణువణువునా వ్యాపిస్తుంటే
అడుగైనా ముందుకు పడని
బడుగు బాటసారిణి
మన భరతమాత.
కులం మతం బేధమంటూ
రాజ్యాంగాలే  ఘోషిస్తే..
పరీక్షల ప్రస్థానాల్లో
ప్రతిభకు చోటేక్కడుంది..?
అంటరానితనం అడ్డుగోడల్లో
ఆటవికత్వం పెరుగుతూంటే..
కుళ్ళుగొట్టు సమాజాన
మానవత్వం మంటగలుస్తుంది.
ఉగ్రవాదం ఉరితాడై..
భారతావని కంఠాన బిగుసుకుంటే
ఉలిక్కిపడిన కాశ్మీరం
భవిష్యత్ ప్రశ్నార్ధకం.
మతోన్మాదం మంటలకు 
రాజ్యహంకారపు ఆజ్యం తోడై,
కన్నూమిన్నూ కానని
దుష్టశక్తులకు 
శాంతిమంత్రం వినపడదు.
పదవీ వ్యామోహం 
పదవులేలుతున్న 
ప్రస్తుత తరుణాన,
పరిపాలన 
ప్రజావసరాలకు 
పనికొస్తుందా..?
వినోదాల మత్తులో 
వికృతాల గమ్మత్తులో 
ఓలలాడుతున్నయువత 
వినూత్న భారత సమీరానికి 
చేరుకునేదేప్పుడు..?
మూఢనమ్మకాల ముసుగుతన్ని 
మూలుగుతున్న సమాజాన్ని
తట్టిలేపి,
ప్రగతి వైపుకు పరుగులెత్తించే 
మేల్కొలుపు రావాలి.
ప్రజాస్వామ్య వారధులై
పత్రికలు ప్రతిక్షణం
పౌరుల్ని జాగరూకుల్ని చేయాలి.
నిర్లిప్తత, నిశీధిలా నిండిన 
ప్రజల హృదయాంతరాల నుండి 
నిజం నిప్పులా చెలరేగి, 
అన్యాయపు అంధకారాన్ని 
అమాంతం పారద్రోలాలి.
సమస్యలను సానుకూలంగా 
పరిశీలించే మనసుకు 
పరిష్కారం దొరక్కపోదు...