Monday, December 27, 2010

కాలంతో నేను..

కాలంతో నేను..
ఆలాపనలా ఒక క్షణం..
ఆశల అశ్వాలే ఉచ్చ్వాశ నిశ్వాసాలుగా
ఆశయాల అంబరాల సంబరాన
ఆమని భావాల వర్షంలో 
ఆనందామృత  అంకురాలు
అణువణువునా తడుస్తుంటే
అంతులేని 'సిరి'నవ్వులు విరుస్తాయి.
ఆహ్లాదపు హరివిల్లులు మెరుస్తాయి.
ఆ నందనవనం లోనికి
ఉప్పెనలా మరో క్షణం..
అక్కరలేని ఆలోచనలు ముప్పిరిగొంటే 
అదుపు లేని ఆవేశం హద్దు మీరుతుంటే 
మనసు మండిపోతుంది 
ఆశ ఆవిరౌతుంది 
సహనం సన్నగిల్లుతుంది 
నిస్సత్తువ నిగారిస్తుంది 
ఉషోదయం ఉసూరుమన్నట్లు 
సంధ్య సోలిపోతున్నట్లు 
క్షణ క్షణం భారంగా    
నిముషాలన్నీ నిర్వీర్యం గా గడుస్తుంటే 
నిలువెత్తు సాక్ష్యంలా
నింగి చాటు నిశీధిలా
నివురుగప్పిన నిజంలా
నిశ్శబ్దంగా నేను
కాలంలో కలసిపోతాను...

మనిషికి మరోవైపు..

మనిషికి మరోవైపు..
ఓ నిశీధి కెరటం
మంచిని మరుగునబెట్టి 
వాస్తవాన్ని వారిస్తుంది
భావాలు కుత్సితమై
హృదయం కుంచించుకుపోతుంది
ఆధునికమో, ఆవాహనమో
తెలియని బడుగు ఆలోచనలు
మెదడును మొద్దుబారుస్తాయి
ఒంటరితనం విరగబడి 
విలయధ్వనుల విందులతో
విరుచుకుపడుతుంది 
సాధించినదేదో తెలియక 
వర్తమానం నివ్వెరపోతుంది
 వికృతమైన ఆవేశాలు
రుధిర వర్షంలో
తడిసిన మల్లెల్లా
అణువణువునా
తనువును తపింపజేస్తాయి
ఇనుప సంకెళ్ళ సంగీతాలే
కాలక్షేపం చేయిస్తాయి
సంతోషం సర్దుకుపోయి
నూతిలోని మండూక ధోరణిలో
సంభరాలు చేసుకొంటుంది
కర్మమో, కాలమహిమో
తెలియక కాళ్ళు నిరంతరంగా
కలి వెంట నడుస్తుంటాయి
'ఉసూరుమనే ప్రాణాలు
ఊరికేం చేస్తాయనే'
గురజాడ మాట
చెవుల్లో గింగిరాలు కొడుతున్నా
నిర్లిప్తతతో నిండిన ఆశలు
అడియాసలవ్వాల్సిందే..
భారీ ఆలోచనల వలలో
చిక్కిన మనసుకు
మంచిచెడుల భేదం తెలియదు
తెలిసేలోగా ఉరికివచ్చిన
'సునామి' లాగా
కెరటం ముంచేస్తుంది
జ్ఞాపకాలు, చరిత్రలో
చెక్కని శిల్పాలవుతాయి
సమస్తం శిధిలమైన తర్వాత
చరిత్రను మాత్రం
చదివేదెవరు..?
అజ్ఞాత శిల్పాలను
ఆదరించేదెవరు..?
****** 

Thursday, December 9, 2010

స్నేహ మాధుర్యం


తొలి వేకువ కిరణం లో
మెరిసిన ఇరు  హృదయాలలో
చిగురించింది అపూర్వ స్నేహం.
కుసుమాల సుగంధాలలో
మురిసిన మనసులలో
విరబూసింది స్నేహం.
చలితెమ్మెర స్పర్శలలో
పులకించిన తనువులో
ఉదయించింది  స్నేహం.
రంగవల్లికల రంగులలో
నిండిన సౌహార్ద్రంలో
ఎగసింది స్నేహం.
ఎగసే అలల సరాగాలలో
తొణికిసలాడే హరివిల్లులో
మెరిసింది స్నేహం.
మకరందం నిండిన సుమాలలో
మునిగితేలిన మిళింద ఝంకారంలో
మిళితమైంది స్నేహం.
అంధకారమైన జీవితంలో
అందివచ్చిన అఖండజ్యోతిలా
వెలుగునిస్తుంది స్నేహం.. 

Wednesday, December 8, 2010