నవోదయం

( నా బెస్ట్ ఫ్రెండ్  "నవోద్" కు గుర్తుగా ఈ పేజీ.. )
  
మిత్రమా..

మిత్రమా..
నా మిత్రమా.. 
నీతో గడిపిన  క్షణాలేవీ..?
నాడు వత్సరాలే క్షణాలుగా 
నీతో ఉండి,
నేడు క్షణాలే యుగాలుగా 
నీకు దూరమై ఉన్నాను.
వెలుగునీడల్లో 
నీ తోడుకై వెదుకుతూ..
అనుబంధాల వెన్నెలలో తడుస్తూ..
అనురాగపు హరివిల్లులో మెరుస్తూ.. 
నువు కనిపించని కనుచూపుమేరలో
నువు దొరకని  ఊహలలో
గడిచిన జ్ఞాపకాల దొంతరలో
ఇలా ఉన్నాను.....

(గమనిక:నా జీవితంలో  నేను  రాసిన మొదటి కవిత ఇది.)
***********





నవోదయం

నవోదయం...
ప్రజల తోడుగా,
ప్రజల వైపు,
ప్రజల కోసం
ప్రజాస్వామ్యం
పయనించిన నాడు
స్వార్ధం మరచి,
సౌహార్ద్రం చూపి 
సాధికార సారధులు 
సమానతను చాటితే 
పదం పదం కదంతొక్కి 
పత్రికలు ప్రతినిత్యం 
ప్రజల హృదయాలను 
తట్టిలేపితే.....
నిరాశా నిశీధి నుండి
నిప్పులా చెలరేగి
నిర్భాగ్య హృదయాలు 
నింగికెదిగితే....
మూఢ విశ్వాసాల
మత్తు నుండి మేల్కొని 
అన్ని మతాలు
మానవతా సౌధాన నిలిస్తే
విపరీత ధోరణులను
విరిచికట్టి యువత
విశ్వాన్ని దాటి విసిరేస్తే 
భారమైన బ్రతుకులకు
చింతించక భావిపౌరులు
బాధ్యతలను గుర్తిస్తే
ఆశల పల్లకీలే
అభ్యుదయ కిరణాలై
అవతరిస్తుంది
నూత్న నవోదయం.
**********




వసంతం

వసంతం..
వడి వడిగా కదిలోస్తే
కనుల కొలనుల వెంబడి 
కళల కలువలు విరియవా
మధురాశల విహంగాలు
మది అంబరాన విహరించవా
తొలి జ్ఞాపకాల తొలకరులకు
తనువు అణువణువూ పులకరించదా
మణిమయ మరకత కాంతులలో 
మందార మకరంద సుగంధాలతో
మందహాస మాలలు మురియవా
చిరునగవుల సిరిలతలను
హత్తుకొన్న సుమ మానసాలు 
అనుక్షణం గర్వించవా
నిరాశా నిశీధి వీడిపోయి
నిందల నీడలు వీగిపోయి 
నిరుపమాన అనురాగ వెన్నెలలో
నిగారించిన సౌహార్ద్రం మెరుస్తుంది
ఆ వెలుగుల జిలుగుల అందంలో
ఆవృతమైన ఆనంద పర్వంలో
ఆశాంతం స్నేహం నిలిచిపోతుంది 
*********