Friday, November 29, 2013

*శత్రువు*

*శత్రువు*అనంతం*
చలి కాలం..
ఉషోదయం..
అప్పుడే తెల్లారిందా..
కను రెప్పలపై క్వింటా బరువున్నట్టుంది
ఎంతకీ తెరుచుకోవేం..
ఎవరైనా కాఫీ లేదా టీ ఇవ్వండర్రా...
ఎవరో దుప్పటితో నన్ను ప్యాక్ చేసినట్లుంది.

కిటికీ లోంచి భానుడు బాకుల్తో గుచ్చుతున్నా...
కదలాలని ఉంది.... కదల్లేకున్నాను.
కలలా ఉంది.... కల్లయితే బావుణ్ణు.
ఛ... మనిషినైపోయాను.. మానునైనా బావుణ్ణు.
విన్ను విరిగి మీద పడ్డా... భయపడక్కరలేదు.
వెలుగు అవసరమే లేకుండా... గబ్బిలాన్నైనా బావుణ్ణు.
పనీ పాటా లేకుండా... రాయినైనా బావుణ్ణు.
ఇన్నాళ్ళు ఇదంతా హాయి అనుకున్నాను.
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.. చైతన్యరాహిత్యమని.
ఇది నా మొదటి శత్రువని..
 

Friday, September 20, 2013

కూపస్థ మండూకం



మిన్ను విరిగి
మీద పడుతుంటే
కనులు మూసుకుంటావేం...
కాల్బలం
తన్నుకు వస్తుంటే
ముడుచుకు కూర్చుంటావేం...
భవిత
బండలవుతుంటే
అదృష్టానికి ఆశ పడతావేం...
పరగొంతులు
పరిహసిస్తుంటే
పరుగు పెడతావేం...
ఆవేశం
తన్నుకువస్తుంటే
నిద్ర నటిస్తావేం...
కదులు... ముందుకు
కదులు... ముందుకు
గమ్యం చేరేంతవరకు.

Thursday, January 12, 2012

నైరాశ్యం


నైరాశ్యంలో...
నిరంతరం భ్రమించే పృథ్వి
అలసి ఆగిపోతుంది.
అరక్షణమైనా ఆగక
పరుగులెత్తే కాలచక్రం
కాళ్ళు విరిగి కూలబడిపోతుంది.
గురి చూసి వదిలిన బాణం
ముందుకెళ్ళనంటూ మొరాయిస్తుంది.
వాయువు బంధీయౌతుంది.
నీరు హిమమౌతుంది.
కనులు విప్పార్చి చూస్తే
అంతా అంధకారం.
చెవులు రిక్కించి వింటే
చచ్చేంత నిశ్శబ్దం.
సజీవ నరకం.
ఇంతేనా జీవితం...?
జవాబు లేని ప్రశ్నలే పరశులై
పదేపదే మనిషిని వేదిస్తాయి.
వెలుతురు కోసం
వీడని తపన...
ప్రయత్నిస్తే...
దారిచూపే చిరుదీపం
దొరక్కపోదు. 

Friday, April 8, 2011

మేలుకో.. మిత్రమా..

మిత్రమా..
అందరి మనసుల్ని ఆవరించిన 
కులమతాల అవరోధాలను 
అమాంతం ఎప్పుడు అధిగమిస్తావు..
అవినీతి అంటువ్యాదిలా 
అన్నివైపులా అల్లుకుపోతుంటే
ఆసాంతం ఎన్నాళ్ళని చూస్తుంటావు..
అనవసరమైన  ఆవేశాలతో 
అన్నదమ్ముల మధ్య అనైక్యత ను పెంచే 
అరాచక శక్తులను ఎప్పుడు అణచివేస్తావు.. 
ఆత్మవంచనను జయించి 
ఆశల అశ్వాలనధిరోహించి
ఆకాంక్షలే ఆలంబనగా ఎప్పుడు నడుస్తావు 
అణువణువునా ఆత్మవిశ్వాసంతో 
అలుపెరుగని అవిశ్రాంతశ్రామికుడివై 
అనితర సాధ్యమైన అభ్యున్నతిని 
అవలీలగా నీవు అధిరోహించాలని 
అడుగడుగునా ఆంధ్రమాత కన్నకలల్ని
ఆకారంగా సాకారం చేస్తావని 
మనసారా కోరుకుంటూ.. 
                             నీ..
                                  శ్రేయోభిలాషి  


Wednesday, April 6, 2011

ఉగాది

ఈ యుగాది..
వినూత్న తెలుగు శకానికి నాంది 
వినీల ఆకాశమంత భారతంలో..
విశాలమైన ఈ ఆంధ్రావనిలో 
విరిసే రంగుల హరివిల్లు ఉగాది...
అమ్మ ప్రేమ లోని వెచ్చదనం
జోలపాట లోని తీయ దనం 
నాన్న మందలింపు లోని మమ'కారం'
బామ్మ చెప్పే కధ  లోని కమ్మదనం 
భార్య మూతివిరుపు లోని పులుపుదనం 
భాద్యతల బంధీగా చేదుదనం
రంగరించిన స్వచ్చమైన అచ్చమైన 
తెలుగు రుచుల సందడి 
మన ఉగాది పచ్చడి...

Thursday, January 6, 2011

సమస్యల హారతి - "భారతి"

నాడు...
సిరులెన్నో చిగురించిన 
రత్నగర్భ  "భారతి".
నేడు...
సమస్యల ప్రళయంలో
భగ్గుమన్న హారతి.
వనరులేన్ని వడివడిగా
కరిగిపోతున్నా
పల్లెనున్న పేదవాడి
ఆకలిరోదన ఆగేనా...? 
అవినీతి  అంటువ్యాధిలా 
అణువణువునా వ్యాపిస్తుంటే
అడుగైనా ముందుకు పడని
బడుగు బాటసారిణి
మన భరతమాత.
కులం మతం బేధమంటూ
రాజ్యాంగాలే  ఘోషిస్తే..
పరీక్షల ప్రస్థానాల్లో
ప్రతిభకు చోటేక్కడుంది..?
అంటరానితనం అడ్డుగోడల్లో
ఆటవికత్వం పెరుగుతూంటే..
కుళ్ళుగొట్టు సమాజాన
మానవత్వం మంటగలుస్తుంది.
ఉగ్రవాదం ఉరితాడై..
భారతావని కంఠాన బిగుసుకుంటే
ఉలిక్కిపడిన కాశ్మీరం
భవిష్యత్ ప్రశ్నార్ధకం.
మతోన్మాదం మంటలకు 
రాజ్యహంకారపు ఆజ్యం తోడై,
కన్నూమిన్నూ కానని
దుష్టశక్తులకు 
శాంతిమంత్రం వినపడదు.
పదవీ వ్యామోహం 
పదవులేలుతున్న 
ప్రస్తుత తరుణాన,
పరిపాలన 
ప్రజావసరాలకు 
పనికొస్తుందా..?
వినోదాల మత్తులో 
వికృతాల గమ్మత్తులో 
ఓలలాడుతున్నయువత 
వినూత్న భారత సమీరానికి 
చేరుకునేదేప్పుడు..?
మూఢనమ్మకాల ముసుగుతన్ని 
మూలుగుతున్న సమాజాన్ని
తట్టిలేపి,
ప్రగతి వైపుకు పరుగులెత్తించే 
మేల్కొలుపు రావాలి.
ప్రజాస్వామ్య వారధులై
పత్రికలు ప్రతిక్షణం
పౌరుల్ని జాగరూకుల్ని చేయాలి.
నిర్లిప్తత, నిశీధిలా నిండిన 
ప్రజల హృదయాంతరాల నుండి 
నిజం నిప్పులా చెలరేగి, 
అన్యాయపు అంధకారాన్ని 
అమాంతం పారద్రోలాలి.
సమస్యలను సానుకూలంగా 
పరిశీలించే మనసుకు 
పరిష్కారం దొరక్కపోదు...
   
                   

Monday, December 27, 2010

కాలంతో నేను..

కాలంతో నేను..
ఆలాపనలా ఒక క్షణం..
ఆశల అశ్వాలే ఉచ్చ్వాశ నిశ్వాసాలుగా
ఆశయాల అంబరాల సంబరాన
ఆమని భావాల వర్షంలో 
ఆనందామృత  అంకురాలు
అణువణువునా తడుస్తుంటే
అంతులేని 'సిరి'నవ్వులు విరుస్తాయి.
ఆహ్లాదపు హరివిల్లులు మెరుస్తాయి.
ఆ నందనవనం లోనికి
ఉప్పెనలా మరో క్షణం..
అక్కరలేని ఆలోచనలు ముప్పిరిగొంటే 
అదుపు లేని ఆవేశం హద్దు మీరుతుంటే 
మనసు మండిపోతుంది 
ఆశ ఆవిరౌతుంది 
సహనం సన్నగిల్లుతుంది 
నిస్సత్తువ నిగారిస్తుంది 
ఉషోదయం ఉసూరుమన్నట్లు 
సంధ్య సోలిపోతున్నట్లు 
క్షణ క్షణం భారంగా    
నిముషాలన్నీ నిర్వీర్యం గా గడుస్తుంటే 
నిలువెత్తు సాక్ష్యంలా
నింగి చాటు నిశీధిలా
నివురుగప్పిన నిజంలా
నిశ్శబ్దంగా నేను
కాలంలో కలసిపోతాను...