Friday, April 8, 2011

మేలుకో.. మిత్రమా..

మిత్రమా..
అందరి మనసుల్ని ఆవరించిన 
కులమతాల అవరోధాలను 
అమాంతం ఎప్పుడు అధిగమిస్తావు..
అవినీతి అంటువ్యాదిలా 
అన్నివైపులా అల్లుకుపోతుంటే
ఆసాంతం ఎన్నాళ్ళని చూస్తుంటావు..
అనవసరమైన  ఆవేశాలతో 
అన్నదమ్ముల మధ్య అనైక్యత ను పెంచే 
అరాచక శక్తులను ఎప్పుడు అణచివేస్తావు.. 
ఆత్మవంచనను జయించి 
ఆశల అశ్వాలనధిరోహించి
ఆకాంక్షలే ఆలంబనగా ఎప్పుడు నడుస్తావు 
అణువణువునా ఆత్మవిశ్వాసంతో 
అలుపెరుగని అవిశ్రాంతశ్రామికుడివై 
అనితర సాధ్యమైన అభ్యున్నతిని 
అవలీలగా నీవు అధిరోహించాలని 
అడుగడుగునా ఆంధ్రమాత కన్నకలల్ని
ఆకారంగా సాకారం చేస్తావని 
మనసారా కోరుకుంటూ.. 
                             నీ..
                                  శ్రేయోభిలాషి  


Wednesday, April 6, 2011

ఉగాది

ఈ యుగాది..
వినూత్న తెలుగు శకానికి నాంది 
వినీల ఆకాశమంత భారతంలో..
విశాలమైన ఈ ఆంధ్రావనిలో 
విరిసే రంగుల హరివిల్లు ఉగాది...
అమ్మ ప్రేమ లోని వెచ్చదనం
జోలపాట లోని తీయ దనం 
నాన్న మందలింపు లోని మమ'కారం'
బామ్మ చెప్పే కధ  లోని కమ్మదనం 
భార్య మూతివిరుపు లోని పులుపుదనం 
భాద్యతల బంధీగా చేదుదనం
రంగరించిన స్వచ్చమైన అచ్చమైన 
తెలుగు రుచుల సందడి 
మన ఉగాది పచ్చడి...