Monday, December 27, 2010

మనిషికి మరోవైపు..

మనిషికి మరోవైపు..
ఓ నిశీధి కెరటం
మంచిని మరుగునబెట్టి 
వాస్తవాన్ని వారిస్తుంది
భావాలు కుత్సితమై
హృదయం కుంచించుకుపోతుంది
ఆధునికమో, ఆవాహనమో
తెలియని బడుగు ఆలోచనలు
మెదడును మొద్దుబారుస్తాయి
ఒంటరితనం విరగబడి 
విలయధ్వనుల విందులతో
విరుచుకుపడుతుంది 
సాధించినదేదో తెలియక 
వర్తమానం నివ్వెరపోతుంది
 వికృతమైన ఆవేశాలు
రుధిర వర్షంలో
తడిసిన మల్లెల్లా
అణువణువునా
తనువును తపింపజేస్తాయి
ఇనుప సంకెళ్ళ సంగీతాలే
కాలక్షేపం చేయిస్తాయి
సంతోషం సర్దుకుపోయి
నూతిలోని మండూక ధోరణిలో
సంభరాలు చేసుకొంటుంది
కర్మమో, కాలమహిమో
తెలియక కాళ్ళు నిరంతరంగా
కలి వెంట నడుస్తుంటాయి
'ఉసూరుమనే ప్రాణాలు
ఊరికేం చేస్తాయనే'
గురజాడ మాట
చెవుల్లో గింగిరాలు కొడుతున్నా
నిర్లిప్తతతో నిండిన ఆశలు
అడియాసలవ్వాల్సిందే..
భారీ ఆలోచనల వలలో
చిక్కిన మనసుకు
మంచిచెడుల భేదం తెలియదు
తెలిసేలోగా ఉరికివచ్చిన
'సునామి' లాగా
కెరటం ముంచేస్తుంది
జ్ఞాపకాలు, చరిత్రలో
చెక్కని శిల్పాలవుతాయి
సమస్తం శిధిలమైన తర్వాత
చరిత్రను మాత్రం
చదివేదెవరు..?
అజ్ఞాత శిల్పాలను
ఆదరించేదెవరు..?
****** 

2 comments:

  1. నమస్కారం అనంత్ గారు

    మీతో పరిచయం అయ్యినందుకు సంతోషం. మీ వచనకవిత్వం బాగుంది. ఇంకా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

    సందీప్

    ReplyDelete
  2. అయ్యా సందీప్ గారూ.. మీ నమస్కారం లోని సంస్కారానికి ప్రతినమస్కారం... నా రచనలు చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.. మీ ఆశీస్సులతో నేను ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రోత్సాహ గవాక్షాలు తెరిచినందుకు కృతజ్ఞుడ్ని...

    ReplyDelete