Monday, December 27, 2010

కాలంతో నేను..

కాలంతో నేను..
ఆలాపనలా ఒక క్షణం..
ఆశల అశ్వాలే ఉచ్చ్వాశ నిశ్వాసాలుగా
ఆశయాల అంబరాల సంబరాన
ఆమని భావాల వర్షంలో 
ఆనందామృత  అంకురాలు
అణువణువునా తడుస్తుంటే
అంతులేని 'సిరి'నవ్వులు విరుస్తాయి.
ఆహ్లాదపు హరివిల్లులు మెరుస్తాయి.
ఆ నందనవనం లోనికి
ఉప్పెనలా మరో క్షణం..
అక్కరలేని ఆలోచనలు ముప్పిరిగొంటే 
అదుపు లేని ఆవేశం హద్దు మీరుతుంటే 
మనసు మండిపోతుంది 
ఆశ ఆవిరౌతుంది 
సహనం సన్నగిల్లుతుంది 
నిస్సత్తువ నిగారిస్తుంది 
ఉషోదయం ఉసూరుమన్నట్లు 
సంధ్య సోలిపోతున్నట్లు 
క్షణ క్షణం భారంగా    
నిముషాలన్నీ నిర్వీర్యం గా గడుస్తుంటే 
నిలువెత్తు సాక్ష్యంలా
నింగి చాటు నిశీధిలా
నివురుగప్పిన నిజంలా
నిశ్శబ్దంగా నేను
కాలంలో కలసిపోతాను...

No comments:

Post a Comment